ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా కొనసాగించాలని.. ప్రభుత్వం తక్షణమే దీనిపై ఆర్డినెన్స్ తీసుకురావాలని పలువురు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని అంబేడ్కర్ భవన్‌లో వివిధ దళిత, గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం రౌండుటేబుల్ సమావేశం నిర్వహించారు. గతేడాది రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.15 వేల కోట్లు కేటాయించి రూ.9,422 కోట్లు పక్కదారి పట్టించేశారన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ద్వారా ఎస్సీలకు ప్రత్యేక సంక్షేమం చేకూర్చే 27 పథకాలకు నిధులను నిలిపివేశారని విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేసి ఒక్క రూపాయి కేటాయింపులు చేయకపోవడం దారుణమన్నారు.ఇప్పటి వరకూ దారిమళ్లించిన రూ.10 వేల కోట్లు సబ్‌ప్లాన్‌కు జమ చేసి ఖర్చు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.సమావేశంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు సానబోయిన రామారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, బీఎస్పీ నాయకులు ఇసుకపట్ల రాంబాబు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశి నవీన్‌కుమార్, కోణాల లాజర్, జార్జి ఆంటోనీ, కోరుకొండ చిరంజీవి, రాజేంద్రప్రసాద్,ఎస్.మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.