పసుపు, ఫైనాఫిల్ పంటలలో మార్కెట్ డిమాండు గల అధిక నాణ్యత, దిగుబడిల నిచ్చే రకాల సాగును ప్రోత్సహించాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరు కార్యాలయంలో ఐ. టి. డి. ఎ. ప్రోజెక్టు అధికారులు, వ్యవసాయ, ఉద్యానవనశాఖ, డి. ఆర్. డి. ఎ. అధికారులతో సమావేశం నిర్వహించారు. గిరిజనులు పండించే పంటలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించుటకు ప్రభుత్వం నుండి కావలసిన సహకారం కొరకు ప్రణాళికను తయారు చేయాలని గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు అందజేసిన నివేదికను పరిశీలించారు.
రైతుల పంటలకు అధిక ధరలు పొందుటకు మార్కెట్ లో డిమాండు గల రకాలను సాగు చేయించాలన్నారు. నివేదికలో జీడి ఉపఉత్పత్తులు తయారీ, జీడి ప్రాససింగు యూనిట్లు అద్దె ప్రాతిపదికన ఏర్పాటు, జిల్లాలో గల అన్నిరకాల గొడౌన్ల సమగ్ర సమాచారం తదితర అంశాలను పొందుపరచి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టరు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతంపేట ఐ. టి. టి. ఎ. ప్రోజెక్టు అధికారి బి. నవ్య, డి. ఆర్. డి. ఏ. ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్, జిల్లా ఉద్యాన అధికారి కె. వి. ఎస్. ఎన్. రెడ్డి, సహాయ ప్రోజెక్టు అధికారులు పాల్గొన్నారు.