గవర్నర్ పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ కీలక వెల్లడించారు. ఇటీవల ముంబై పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విషయం చెప్పానని వెల్లడించారు. ట్విటర్‌లో సోమవారం (జనవరి 23) వరుసగా భావోద్వేగ పోస్టులు చేశారు. ఇక రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. తన శేష జీవితాన్ని పుస్తకాలు చదవడం, రాయడం, ఇతర వ్యాపకాలతో గడపాలని అనుకుంటున్నట్లు 80 ఏళ్ల కోశ్యారీ తెలిపారు. ఛత్రపతి శివాజీపై నవంబర్‌లో కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
‘సంఘ సంస్కర్తలు, వీర యోధులు పుట్టిన గడ్డ మహారాష్ట్ర లాంటి గొప్ప రాష్ట్రానికి రాజ్య సేవకుడిగా సేవలందించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రజలు నాపై చూపించిన ప్రేమ, అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోను’ అని భగత్ సింగ్ కోశ్యారీ ట్వీట్ చేశారు. 2019 సెప్టెంబర్ 5న ఆయన మహారాష్ట్ర 22వ గవర్నర్‌గా నియమితులయ్యారు.
మహారాష్ట్ర గవర్నర్‌గా కోశ్యారీ అనేకసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. 2019లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభ సమయంలో కోశ్యారీ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెల్లవారుజామునే ప్రమాణస్వీకారం చేయించడం, మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం నామినేట్ చేసిన 12 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తిరస్కరించడం లాంటి ఘటనలతో ఆయన వార్తల్లో నిలిచారు.