టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ 40వ జన్మ దిన వేడుకలు జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో 40 కేజీల కేకును కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజ నేయులు మాట్లాడుతూ.... రాష్ట్ర రాజకీయాల్లో లోకేశ్ పాదయాత్రతో పెను మార్పులు చోటు చేసుకోనున్నట్లు స్పష్టం చేశారు. లోకేశ్ యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. మాజీ ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నాడు జగన్, ఆయన తల్లి, చెల్లి పాద యాత్రలు చేసినప్పుడు నాటి సీఎం చంద్రబాబు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని, ఇప్పుడు లోకేశ్ పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ప్రశ్నించారు. ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రజలను జగన్ బానిసత్వ సంకెళ్ల నుంచి విడిపించడానికే లోకేశ్ పాదయాత్ర కొనసాగిస్తున్నారని అన్నారు. లోకేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఆశాకిరణమని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఫైర్ స్టేషన్ సెంటర్‌లో ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బొరగం శ్రీనివాస్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు సూర్యచంద్రరావు, కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్, తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.