ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం తీసుకువచ్చిన సబ్‌ప్లాన్ చట్టాన్ని ఎలాంటి కాలపరిమితి లేకుండా పునరుద్ధరించాలని పలు దళిత, బహుజన సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరాయి. ఈ మేరకు సీఎం జగన్‌కు రాసిన బహిరంగ లేఖను విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నేతలు సోమవారం విడుదల చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల సామాజిక స్వావలంబన, ఆర్థికాభివృద్దికి 2013 జనవరి 24న ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన సబ్‌ప్లాన్ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ధ్వజమెత్తారు. గత మూడేళ్లల్లో రూ.20 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించారన్నారు. నిధులను ఖర్చు చేయకపోగా ఈ చట్టం కింద రూ.49,710 కోట్లు ఖర్చు చేసినట్టు మైసూరులో జరిగిన జాతీయ సదస్సులో మంత్రి మేరుగు నాగార్జున పచ్చి అబద్ధాలు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత కులాల ఒత్తిడికి తట్టుకోలేక.. కాలం ముగుస్తుందని తెలిసినా చట్టాన్ని తీసుకురాకుండా ఆర్డినెన్స్‌తో కన్నీళ్లు తుడిచారని విమర్శించారు. చట్టంలోని లోసుగులు తొలగించి కాలపరిమితి లేకుండా పరిపూర్ణంగా చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దళిత, గిరిజన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఉప్పులేటి దేవీప్రసాద్ మాట్లాడుతూ అణగారిన కులాల ఆర్థిక తోడ్పాటుగా ఉన్న చట్టాన్ని నీరుగారిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని, దోచుకోవడం, దాచుకోవడానికే పరిమితమైందని మండిపడ్డారు. నేషనల్ క్రాంతి పార్టీ అఽధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు, జేఏసీ ఉపాధ్యక్షుడు మామిడి సత్యం, అమరావతి దళిత జేఏసీ కన్వీనర్ చిలకా బసవయ్య, నవతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణకిశోర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.