చిన్నపాటి మైక్రో డ్రోన్ల ను కూడా గుర్తించి వాటిని పనిచేయకుండా నిలిపివేసే నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్(ఎన్‌ఎడీఎ్‌స)ను తిరుమలలో ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల ఆలయం మీదుగా డ్రోన్ షాట్స్ వివాదంపై ఆయన సీవీఎస్వో నరసింహకిషోర్‌తో కలిసి సోమవారం మీడియాకు వివరణ ఇచ్చారు. ఐవోసీఎల్ సర్వే కోసం తాము అధికారికంగా డ్రోన్‌కు అనుమతి ఇచ్చామన్నారు. అయితే ఈ సంస్థలోని సిబ్బంది అత్యుత్సాహంతో డ్రోన్ ద్వారా శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరించారా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఆల య భద్రతను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలుపై భారత్ ఎలక్ర్టానిక్స్ లిమిటెడ్(బెల్)తో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. ఈ సిస్టమ్ ఏర్పాటుకు దాతలు ముందుకు వచ్చారన్నారు. కాగా, టాటా సంస్థ అందించిన రూ.150 కోట్ల విరాళంతో తిరుమలలో ప్రపంచస్థాయి మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. టీటీడీ డిపాజిట్లు పెరిగాయని.. 2019లో రూ.13,025 కోట్లుగా ఉన్న టీటీడీ బ్యాంక్ డిపాజిట్లు ఇప్పుడు రూ.15,938 కోట్లని ఈవో వెల్లడించారు. బంగారు డిపాజిట్లు కూడా 7,339 కేజీల నుంచి 10,258 కేజీలకు పెరిగాయన్నారు. సుమారు 7,126 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న మొత్తం 960 ఆస్తులపై టీటీడీ చరిత్రలో మొదటిసారిగా శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. రూ.23 కోట్లతో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఈ నెల 27నుంచి లెక్కింపులు మొదలవుతాయన్నారు. కాగా, శ్రీవాణిట్రస్టు ద్వారా ఇప్పటివరకు రూ.650 కోట్లు విరాళంగా అందాయని ధర్మారెడ్డి తెలిపారు. వీటిలో 50 శాతం నిధులను టీటీడీ జనరల్ అకౌంట్‌కు బదిలీ చేస్తున్నారన్న ప్రచారాన్ని ఆయ న ఖండించారు. వెనుకబడిన ప్రాంతాల్లో 932 ఆలయాల నిర్మాణానికి రూ.వంద కోట్లు కేటాయించామన్నారు.