క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ సొంత పార్టీ సభ్యుల నుంచి మరోసారి తిరుగుబాటును ఎదుర్కొంటున్నారు. పోర్నోగ్రఫీ వెబ్‌సైట్‌లను పిల్లలు యాక్సెస్ చేయకుండా నిరోధించే చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి ప్రయత్నిస్తోంది. దీంతో అశ్లీల వీడియోలు పొందేందుకు స్పష్టమైన వయసును నిర్థారించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ భద్రతా బిల్లు సవరణల ప్రకారం.. చట్టంగా మారిన ఆరు నెలల్లోపు అన్ని పోర్న్ వెబ్‌సైట్‌లు వయస్సు ధ్రువీకరణ వ్యవస్థలను తప్పనిసరిగా అమలు చేయాలి. హానికరమైన కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైతే.. టెక్ సంస్థల యజమాన్యాలు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ నెల ఆరంభంలో టోరీ ఎంపీల తిరుగుబాటు అనంతరం చట్టసభల నుంచి వచ్చిన డిమాండ్లను ప్రధాని సునాక్ ఆమోదించారు. అయితే మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా చట్టాలు సాధారణం కావాలని ప్రభుత్వం వాదిస్తుండగా.. పోర్నోగ్రఫీ చిన్నారులకు హానికరమని, తక్షణ చట్టం అవసరమని కన్జర్వేటివ్ సభ్యులు వాదిస్తున్నారు. ఇంటర్నెట్‌ను పిల్లలు వినియోగిస్తున్న సమయంలో ఈ వెబ్‌సైట్‌ల బారిన పడకుండా వారిని నిరోధించడానికి రూపొందించిన ఆన్‌లైన్ సేప్టీ బిల్లును సోమవారం ఎగువసభ ఆమోదించింది.
ఈ కొత్త సవరణలు ఫిబ్రవరి చివరలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆన్‌లైన్ జూదం కోసం వినియోగించిన కఠినమైన వయస్సు ధ్రువీకరణ పద్ధతులను ఉపయోగించడం ద్వారా 18 ఏళ్లు పైబడి ఉన్నారని నిరూపించాలని డిమాండ్ చేశారు. ఉదాహరణకు ఐడీ కార్డు లేదా క్రెడిట్ కార్డు వివరాలను ఉపయోగించడం. అయితే పెద్దలకు మాత్రమే సైట్‌ల కోసం టెక్ సంస్థలు వయసు తనిఖీలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదు. 2017 డిజిటల్ ఎకానమీ చట్టం వయసు ధ్రువీకరణ నిబంధనలను కలిగి ఉన్నప్పటికీ.. ప్రభుత్వం దానిని ఆమోదించలేదు.
‘‘తప్పనిసరిగా వయసు ధ్రువీకరణకు స్పష్టమైన టైమ్‌టేబుల్, నిబద్ధత అవసరం’’ అని సవరణలను పర్యవేక్షిస్తున్న కన్జర్వేటివ్ పీర్ జేమ్స్ బెథెల్ మంగళవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుత నిబంధనల్లో చాలా లొసుగులు ఉన్నాయి.. వాటి అమలు, టైమ్‌టేబుల్ కూడా సరిగ్గా లేదు అని చెప్పారు. అయితే, వెబ్‌క్యామ్ లేదా ఫోన్ కెమెరాతో వారి ముఖాన్ని విశ్లేషించి, వయసును అంచనా వేసే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడంతో సహా ధ్రువీకరణకు సంబంధించిన ఇతర విధానాలకు ఎలాంటి గుర్తింపు పత్రాలు అవసరం లేదు. యోతి రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించిన వారు ఈ విధానాన్ని ఇప్పటికే వినియోగిస్తున్నారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్ గతేడాది అక్టోబరులో బ్రిటన్ ప్రధానిగా ఎంపికై చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అంతకు ముందు ప్రధానిగా ఎంపికైన లిజ్ ట్రస్ నెల రోజులకే రాజీనామా చేశారు.