కొందరి మరణం ఎవరూ ఊహించని విధంగా జరిగిపోతుంది. తాజాగా ఓ విచిత్ర మరణం చోటు చేసుకొంది. కుక్క ఎప్పుడైనా మనిషిని కాల్చి చంపుతుందని ఊహిస్తారా? అది కూడా తనను ప్రాణంగా చూసుకునే యజమానిని? అమెరికాలోని కన్సాస్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పెంపుడు శునకాన్ని వెంటబెట్టుకొని వేటకు వెళ్లిన 30 ఏళ్ల ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆ పెంపుడు కుక్క పొరపాటున తుపాకీ పేల్చడంతో అతడు దుర్మరణం పాలయ్యాడు. పికప్ ట్రక్ వెనక సీట్లో యజమానికి చెందిన గన్ ఉంది. డ్రైవింగ్ సీట్లో వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ట్రక్కులో వెళ్తుండగా ఆ కుక్క.. రైఫిల్‌పై కాలు వేయడంతో అది పేలింది. అందులోని బుల్లెట్ దూసుకెళ్లి ముందు సీట్లో కూర్చున్న యజమాని వెన్నులో దిగింది.
ఈ ఘటనలో శునకం యజమాని అక్కడిక్కడే మృతి చెందాడని అధికారులు తెలిపారు. ‘సుమారు 30 ఏళ్ల వ్యక్తి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. గాయపడిన వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు’ అని సమ్నర్ కౌంటీ షరీఫ్ కార్యాలయం తెలిపింది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఇది వేట సందర్భంగా ప్రమాదవశాత్తూ చోటు చేసుకున్న ఘటనగా ప్రాథమికంగా నిర్దారించామని అధికారులు తెలిపారు. ఘటనకు కారణమైన కుక్క, బాధితుడి పెంపుడు శునకమేనా? కాదా..? అనే సంగతి కూడా తేలాల్సి ఉందని అన్నారు.
మనుషుల కంటే తుపాకుల సంఖ్యే అధికమైన అమెరికాలో కాల్పుల ఘటనలు కొత్తేమీ కాదు. అయితే, ఇలా ‘కుక్క’ చేతిలో ‘కుక్క చావు’ చావడం మాత్రం ప్రపంచంలో ఇదే మొదటిసారి. గత రెండు రోజుల్లో అమెరికాలో మూడు చోట్ల కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 20 మంది వరకూ మరణించారు.