తాజాగా బయటకు వచ్చిన ఓ నివేదిక భారత్, చైనా సరిహద్దుల వివాదం గురించి ప్రస్తావించింది. ఇదిలావుంటే తూర్పు లడఖ్‌లోని 65 పెట్రోలింగ్ పాయింట్‌లలో 26 స్థావరాలపై భారత్ పట్టుకోల్పోయిందని ఓ సీనియర్ పోలీస్ అధికారి నివేదిక బయటపెట్టింది. చైనాతో 3,500 కిలోమీటర్ల సరిహద్దులో వివిధ ఫ్లాష్‌పాయింట్‌ల వద్ద ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ నివేదికపై ఆందోళన వ్యక్తమవుతోంది. ‘‘ప్రస్తుతం కారాకోరం కనుమ నుంచి చుమూర్ వరకు 65 పీపీలు (పెట్రోలింగ్ పాయింట్లు) ఉన్నాయి... వీటిని ఐఎస్ఎఫ్‌లు (భారత భద్రతా దళాలు) క్రమం తప్పకుండా పెట్రోలింగ్ చేయాలి.. 65 పీపీలో 26 ఇంటిలో ఉనికి పోతుంది (అంటే 5- 17, 24-32, 37 పెట్రోలింగ్ పాయింట్లపై భారత్ నియంత్రణ కోల్పోయింది)’’ అని లడఖ్ ప్రధాన నగరం లేహ్ పోలీసు సూపరింటెండెంట్ పీడీ నిత్యా అన్నారు.
గతవారం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన పోలీస్ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ నివేదికను సమర్పించారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు హాజరయ్యారు. ‘‘చాలా కాలం నుంచి భారత భద్రతా దళాలు లేదా పౌరుల ఉనికి ఆ ప్రాంతాల్లో లేదు కాబట్టి, చైనీయులు ఈ ప్రాంతాల్లో ఉన్నారనే వాస్తవాన్ని అంగీకరించాలి... ఇది ఐఎస్ఎఫ్ నియంత్రణలో ఉన్న సరిహద్దును భారతదేశంవైపుకు మార్చడానికి దారితీస్తుంది.. అటువంటివి వాటిలో బఫర్ జోన్ సృష్టిస్తారు.. ఇది చివరికి భారతదేశం ఈ ప్రాంతాలపై నియంత్రణను కోల్పోయేలా చేస్తుంది. పీఎల్ఏ (చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) అంగుళం అంగుళం భూమిని ఆక్రమించుకునే 'సలామీ స్లైసింగ్' వ్యూహం అంటారు’’ అని నివేదికలో తెలిపారు.
‘‘అత్యుత్తమ కెమెరాలను ఎత్తైన శిఖరాలపై ఉంచి మన బలగాల కదలికలను పర్యవేక్షించడం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించే చర్చలలో భాగంగా సృష్టించే బఫర్ జోన్‌లను చైనా సద్వినియోగం చేసుకుంది... బఫర్ జోన్‌లో కూడా మన కదలికను వారు 'తమది' అని పేర్కొంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ' 'ఆపరేషన్ ప్రాంతం ఆపై మరిన్ని 'బఫర్' జోన్‌లను సృష్టించడానికి వెనుకకు వెళ్లాలని కోరుతున్నారు’’ అని పీడీ నిత్య తన నివేదికలో వివరించారు. గాల్వాన్ లోయలోనూ చైనా ఇదే వ్యూహా అనుసరించిందని చెప్పారు.
ప్రాంతాలను హద్దులు దాటి వాటిని నిర్మానుష్యంగా ఉంచడం కూడా సైనికుల నైతికతను ప్రభావితం చేస్తుందని నిత్య అన్నారు. ‘‘400 మీటర్ల వెనక్కి వెళ్లితే పీఎల్ఏతో నాలుగేళ్ల పాటు శాంతిని కొనుగోలు చేయవచ్చు అప్పుడు అది విలువైనదేనని ఫార్వర్డ్ ఏరియాలోని ఒక సీనియర్ అధికారి చెప్పారని నివేదిక పేర్కొంది.
ఇదిలావుంటే ఈ నివేదికపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నివేదికను తొలుత ప్రచురించిన ది హిందూ పత్రికతో రక్షణ వర్గాలు మాట్లాడుతూ.. ఆ వాదనలను తోసిపుచ్చింది. ‘ఘర్షణ ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గడం వల్ల భూభాగాన్ని కోల్పోలేదు’ అని పేర్కొన్నాయి. ‘‘వివాదాలపై ఇరు పక్షాల మధ్య దౌత్యపరమైన పరిష్కారం పెండింగ్‌లో ఉన్నందున పెట్రోలింగ్ కోసం కొన్ని ప్రాంతాలకు పరిమితం చేశాం... పచ్చిక భూములు కోల్పోలేదు. బఫర్ జోన్‌లో పీఎల్ఏ మాదిరిగానే కెమెరాలు, సాంకేతిక మార్గాలు మన వద్ద కూడా ఉన్నాయి.. అందువల్ల ఆ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాం’’ తెలిపాయి.