భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు. భారత్ ఆర్థిక విధానాలు ప్రపంచానికే దిశా నిర్దేశం చేస్తున్నాయని అన్నారు. ఈ ఏడాది జీ -20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడం భారత ప్రజలకు గర్వ కారణం అని అన్నారు. ఈ ఏడాది ఏడుగురు తెలుగు వారికి కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించడం అభినందనీయం అన్నారు. వీరికి త్వరలోనే బీజేపీ సత్కారాలు చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ జాతిని ఏకం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని స్మరించుకోవాలని, సంస్థానాలను విలీనం చేసి నవశక్తిశాలి భారత్ ను సాకారం చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. సుహాసిని ఆనంద్, బీజేపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా ఇంచార్జి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయానంద రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీనివాస్, దామోదర్ యాదవ్, దిలీప్ వర్మ తదితరులు పాల్గొన్నారు.