టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం కుప్పంలో 'యువగళం' పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు. ముందుగా వరదరాజులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు కుప్పంకు తరలివచ్చారు. దీంతో పసుపు జెండాలు, టీడీపీ శ్రేణులతో కుప్పం సందడిగా మారిపోయింది. జై యువగళం అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. కాసేపట్లో అంబేద్కర్ విగ్రహానికి లోకేష్ నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 1:05 గంటలకు కుప్పం బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం 1:25 గంటలకు కొత్త బస్టాండ్ దగ్గర పొట్టి శ్రీరాములు, గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు 'యువగళం' బహిరంగ సభకు లోకేష్ హాజరుకానున్నారు.