నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాల్లో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి నేతృత్వంలోని బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. నివాస గృహాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, వాణిజ్య పరమైన భారీ భవంతుల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంలో, కొన్ని భవనాలను క్రమబద్ధీకరించడంలో సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనే ఫోన్‌కాల్ ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీకి ఏసీబీ అధికారులు వచ్చారు. సాయంత్రం 4గంటల సమయంలో ఏసీబీ బృందం మున్సిపల్ కార్యాలయంలోకి అడుగుపె ట్టింది. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ సెక్షన్లలోకి వెళ్లి తలుపులు మూసి రికార్డులను తనిఖీ చేశారు. రెండు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని పూర్తిస్థాయిలో విచారించారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో ఇతరులను ఎవరినీ లోపలికి అనుమతించలేదు. రాత్రి పొద్దుపోయే వరకు ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. శనివారం కూడా తనిఖీలు కొనసాగించాలని అధికారులు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.