బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కన్నా లక్ష్మీనారాయణ మధ్య నెలకొన్న విభేదాలపై చర్చలు మొదలయ్యాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి శివప్రకాశ్‌తో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ విజయవాడ నగర కమిటీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. ఇద్దరూ ఏకాంతంగా రెండు గంటలపాటు చర్చించుకున్నారు. కొద్దిరోజుల క్రితం సోము వీర్రాజుపై కన్నా ప్రత్యక్ష విమర్శలు చేశారు. కన్నా అధ్యక్షునిగా ఉన్నప్పుడు నియమించిన జిల్లా అధ్యక్షులను సోము వీర్రాజు తొలగించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, పార్టీలో ఏమి జరుగుతుందో తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు. తర్వాత ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలు, భీమవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కన్నా దూరంగా వున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారుతున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ చర్చనీయాంశంగా మారింది. భేటీ ముగిసిన అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను శివప్రకాశ్‌కు వివరించా. నేను బీజేపీని వీడనని స్పష్టం చేశా. జనసేన నేత నాదెండ్ల మనోహర్ నాకు మిత్రుడు. నేను జనసేనలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు కేవలం ప్రచారమే. శివప్రకాశ్ నన్ను బుజ్జగించలేదు. పార్టీలో జరిగిన అవమానాల వల్ల నేతలు రాజీనామాలు చేస్తున్నారు’’ అని కన్నా చెప్పారు.