గిరిజన ప్రాంతాల్లోని పాలిటెక్నికల్ కళాశాలల్లో ప్రవేశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై రాష్ట్ర సాంకేతిక విద్యా డైరెక్టర్ సి.నాగరాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం విజయనగరం జిల్లా, సీతంపేటలోని ఐటీడీఏ ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంలు, గురుకుల ప్రిన్సిపాల్ ఐటీఐ, పాలిటెక్నికల్ ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతంపేట పాలిటెక్నికల్ కళాశాలలో సింగిల్ డిజిట్ ప్రవేశాలు ఉండడంపై ఆమె విస్మయం చెందారు. గతంలో రూ.450 ఉన్న అడ్మిషన్ రుసుంను వంద రుపాయలకు తగ్గించినా చాలా పాలిటెక్నికల్ కళాశాలలో విద్యార్థులు ఎందుకు చేరడం లేదని ప్రశ్నించారు. అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉండగా, వాటి ద్వారా ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నప్పటికీ ప్రవేశాలు తగ్గడానికి ప్రధాన కారణం సిబ్బంది పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడమేనని చెప్పారు. ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో బాలికల కోసం 8 పాలిటెక్నికల్ కళాశాలలు ఉన్నాయన్నారు. వాటితో పాటు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు 84, ప్రైవేట్‌వి 130పైగా ఉన్నాయని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు పాటిటెక్నికల్ కోర్సుల్లో చేరి, ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో బి.నవ్య, ఏకలవ్య ప్రిన్సిపాల్ సురేష్, ఎడ్యుకేషనల్ ఓఎస్‌డీ యుగంధర్, గిరిజన సహాయ సంక్షేమాధికారి మంగవేణి తదితరులు పాల్గొన్నారు.