‘‘రాజ్యాంగ మౌలిక విలువలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోంది. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు కలసిరావాలి’’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. శుక్రవారం విశాఖ , జగదాంబ జంక్షన్‌లోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధించడం తప్పు. గణతంత్ర దినోత్సవం పేరుతో రాజ్యాంగం గొప్పదనాన్ని చెబుతూ, మరోపక్క భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛను మోదీ ప్రభుత్వం కాలరాసిందని ఆరోపించారు. ఐక్య ఉద్యమాలతోనే ఫాసిస్ట్ తరహా చర్యలను నిరోధించగలమని అన్నారు. జీవో నంబరు 1 ద్వారా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉద్యమాలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో పంచాయతీ సర్పంచుల హక్కులను హరించి, వారిని ఉత్సవ విగ్రహాలుగా మిగిల్చారని రాఘవులు తెలిపారు. ఈ నెల 30న విశాఖలో స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు చేపట్టిన ప్రజా గర్జనకు సీపీఎం అండగా ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ప్రత్యేక హోదా సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రవ్యాప్త యాత్రకు సీపీఎం మద్దతు ఇస్తుందని తెలిపారు.