వాల్మీకులను మోసం చేసే రకంగా కార్యచరణ చేస్తే వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోస్తామని జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్య క్షుడు అంకె ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడా రు. పాదయాత్ర సమయంలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని చెప్పిన సీఎం జగన్మోహనరెడ్డి కేంద్ర ప్రభుత్వం వద్ద ఎందుకు ప్రస్తావించలేకపోతున్నారని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన ఎంపీలు కేంద్ర పెద్దల దగ్గర వాల్మీకి బోయల అంశం పై అదే తీరు కొనసాగిస్తుండటం దారుణమన్నారు. ఎన్నికలకు సంవత్సరం ముందు వాల్మీకి బోయల స్థితిగతుల అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్‌కుమార్ ఏకసభ్య కమిషన కాలయాపన కోసమేనని మండిపడ్డారు. ఆ కమిషనను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సుబ్రహ్మణ్యం కమిషన పేరిట వాల్మీకులను మోసం చేస్తే.. ఇప్పుడు జగన శామ్యూల్ కమిషన పేరిట వాల్మీకి బోయలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో రాప్తాడు నియోజకవర్గ ఇనచార్జ్ సాకే పవనకుమార్, విజయలక్ష్మి, ఎర్రిస్వామి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.