ముదినేపల్లిలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో ఉంటూ స్థానిక జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న మోచర్ల తేజ్ కుమార్ (15) ఆత్మహత్య మిస్టరీగా మారింది. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం కొర్నెపాడు గ్రామానికి చెందిన ఈ విద్యార్థి ఈ నెల 23న గుడివాడ – విజయవాడ రైల్వే లైనులో దోసపాడు సమీపంలో రైలు కిందపడి దుర్మరణం పాలైన విషయం విదితమే. ఈ ఘటనపై గుడివాడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులు, బంధువులను విచారించగా పరీక్షలంటే భయపడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని చెబుతున్నారని రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ వెంకటే శ్వరరావు తెలిపారు. ఇదిలా ఉండగా, చదువులో ముందుండే విద్యార్థి తేజస్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడేందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటన్నది పోలీసులకు సైతం అంతుబట్టడం లేదు. ఆ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం వెనుక బలమైన కారణం ఉంటుందని పోలీసులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 13న సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లి 23న తిరిగి ముదినేపల్లి హాస్టల్‌కు వచ్చి ఒక్క రాత్రి ఉండి 24న ఇంటికి వెళ్తున్నానని సిబ్బందికి చెప్పి వెళ్లిపోయి ఇంటికి వెళ్లకుండా రైలు కింద పడి ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడన్నదే అంతం బట్టని వ్యవహారంగా ఉంది. నిజానిజాలు తేల్చేందుకు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రంగంలోకి దిగాయి.