అపులు ఎక్కువైపోవడంతో ఓ వ్యాపారి ఆత్మహత్యచేసుకొన్నాడు. ఓ టెక్స్‌టైల్ వ్యాపారి తన భార్యను చంపి.. తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. పన్నా నగరంలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఘటనా స్థలిలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. పన్నాకు చెందిన టెక్స్‌టైల్ వ్యాపారి సంజయ్ సేత్.. తన భార్య మీనాను తొలుత తుపాకితో కాల్చి.. తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భాగేశ్వర్ ధామ్ భక్తుడైన సంజయ్.. ‘‘గురూజీ నన్ను క్షమించండి.. మరో జన్మంటూ ఉంటే మీ ప్రియ భక్తునిగా ఉంటాను’’ అని సూసైడ్ నోట్‌లో రాశారు.
ఆత్మహత్యకు ముందు ఓ వీడియోను రికార్డ్ చేసిన సంజయ్.. తన వద్ద నుంచి అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఎగవేసిన వారు పేర్లను ప్రస్తావించారు. ‘‘దయచేసి నా పిల్లలు, నా కూతురు వివాహం కోసం నా డబ్బు తిరిగి ఇవ్వండి.. ఆమె పెళ్లిని రూ. 50 లక్షల నుంచి రూ. కోటితో చేయండి.. నా కుమార్తె బ్యాంకు ఖాతాలో డబ్బు రూ. 29 లక్షలు లాకర్‌లో ఉంది. నా భార్య, నేను ఇద్దరూ బతకలేక వెళ్ళిపోతున్నాం... కూతురికి చాలా నగలు ఉన్నాయి... పిల్లలూ నన్ను క్షమించండి’’ అని కన్నీటిపర్యంతమయ్యాడు.
పన్నాలోని కిషోరేగంజ్ ప్రాంతంలో సంజయ్ సేత్ కుటుంబం నివాసం ఉంటోంది. శనివారం సాయంత్రం సంజయ్, భార్య మీనాలు తమ ఇంటి రెండో అంతస్తులోని గదిలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తుపాకి కాల్పుల శబ్దం వినిపించడంతో కుటుంబసభ్యులు పైకి పరుగు పరుగున వెళ్లారు. అప్పటికే మీనా చనిపోయి రక్తపు మడుగులో పడి ఉంది. కొన ఊపిరితో ఉన్న సంజయ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
పన్నా ఎస్పీ ధర్మరాజ్ మీనా మాట్లాడుతూ.. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని అన్నారు. ‘‘ఇది చాలా బాధాకరమైన సంఘటన.. విచారణ జరుగుతోంది. ప్రస్తుతం బయటి వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు కనిపించడం లేదు.. ఆ గదిలో దంపతులు ఒంటరిగా ఉన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’’ అని అన్నారు.