టీీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంది. ఇదిలావుంటే తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర.. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు కొనసాగింది. వివిధ వర్గాల ప్రజలను పలకరిస్తూ.. వారి సమస్యలు వింటూ లోకేష్ ముందుకు సాగారు. అయితే.. పాదయాత్ర సమయంలో.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తెలుగుదేశం పార్టీ తప్పుబట్టింది. లోకేష్ పాదయాత్రకి కర్ణాటక పోలీసుల రక్షణ కల్పించారని.. టీడీపీ ట్వీట్ చేసింది. జగన్ ఆదేశాలతో ఖాకీలు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆరోపించింది.
జగన్ ఆదేశాలతో రక్షణ కల్పించాల్సిన ఏపీ పోలీసులు.. తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. కుప్పం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర మూడు రోజులుగా సాగుతుంటే.. ఏపీ పోలీసులు నామ్ కే వాస్తేగా బందోబస్తు చేపట్టారని.. మొత్తం టీడీపీ వాలంటీర్లు, ప్రైవేట్ భద్రతా సిబ్బంది, అభిమానులే రక్షణ వలయంగా లోకేష్ వెన్నంటి నడుస్తూ ఉన్నారని తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. అక్కడే ఉన్న ఏపీ పోలీసులు సినిమా చూస్తున్నట్టు.. తమకు సంబంధంలేని భద్రత అన్నట్టు ప్రేక్షకపాత్ర పోషించారని ఆరోపించింది.
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో కర్ణాటక సరిహద్దు గ్రామాలున్నాయి. ఈ ఏరియాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుందని తెలిసి.. ఎటువంటి బందోబస్తును టీడీపీ అడగకపోయినా.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్రకి భారీ భద్రత కల్పించిందని.. తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. కుతేగాని గ్రామం వద్దకు చేరుకున్న కర్ణాటక (Karnataka) డీఎస్పీ, రోప్ పార్టీ, కానిస్టేబుళ్లు యువగళం పాదయాత్రకి చాలా క్రమశిక్షణగా భద్రత కల్పించారని తెలిపింది. లోకేష్ చుట్టూ వలయంగా ఏర్పడి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాదయాత్ర కొనసాగేలా చూశారని ట్వీట్ చేసింది.