అనుమానాస్పద స్థితిలో వ్యవసాయ బావిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మాడుగుల మండలం వీరనారాయనం గ్రామంలో ఆదివారం చోటు చేసుకున్నది. వి మాడుగుల ఎస్ఐ పి. దామోదర్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం వి. మాడుగుల మండలం, వీరనారాయనం గ్రామానికి చెందిన ఆడారి మురళి (29) శనివారం సా. 6. 30గం. లకు ఫోన్ ఇంట్లో వదిలి బయటకు వెళ్ళాడని కుటుంబసభ్యులు చెప్పారు. రాత్రి 11 దాటినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం కలిగింది. వెంటనే వారు వాకబు చేసినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం పొలం పనులు నిమిత్తం వ్యవసాయ బావి వద్దకు వెళ్లేసరికి మురళి మృతిచెంది ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు అండమాన్ లో పని చేస్తూ రెండు నెలల క్రితం గ్రామానికి వచ్చాడని, మురళికి పెళ్లి సంబంధం కుదిరింది. ఫిబ్రవరి నెల 9వ తేదీని పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఇలా జరగడం తో కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.