సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ వివాహిత ఫ్యాన్ హుక్‌కు ఉరివేసుకుని మృతిచెందింది. అల్లుడి వేదింపులే కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన వి. జుత్తాడ సమీపంలోని దువ్వపాలెంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. సీఐ గొలగాని అప్పారావు తెలిపిన వివరాల మేరకు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన హనుమంతు గిరిప్రసాద్ నగరంలోని ఓ ప్రైవేటు దంత వైద్యశాలలో డెంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి హైదరాబాద్ మేడిచర్లకు చెందిన గుడుమూరి విష్ణు కుమారై సౌజన్యతో గత ఏడాది ఆగస్టులో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నకానుకల కింద రూ. 6 లక్షలు నగదు, 13 తులాల బంగారం ఇచ్చారు. వి. జుత్తాడ సమీప దువ్వపాలెం వద్ద కొత్తగా నిర్మించిన ఇంటిని కొనుగోలు చేసిన ఈ దంపతులు అక్కడే నివసిస్తున్నారు. సౌజన్య అమెజాన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా వర్క్ ఫ్రమ్‌హోమ్ విధులు నిర్వర్తిస్తోంది. కాగా సొంతంగా డెంటల్ క్లినిక్ పెట్టాలనే కోరికతో ఉన్న గిరిప్రసాద్‌కు ఇందుకోసం పుట్టింటి నుంచి డబ్బు తెమ్మని తరచూ భార్య సౌజన్యను వేధించేవాడు. కుమార్తె కాపురం సజావుగా సాగుతుందనే ఉద్దేశంతో ఆమె తండ్రి ఫోన్‌పే ద్వారా డబ్బు పంపుతుండేవారు. అయినా వేధింపులు ఆపకపోగా, తరచూ మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో శనివారం భార్యాభర్తల మధ్య మధ్య తీవ్ర వివాదం జరగడంతో మనస్తాపం చెందిన సౌజన్య తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది. గిరిప్రసాద్ బయటికి వెళ్లిపోయాడు. తిరిగి వచ్చిన అతడు బెడ్‌రూమ్ తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్ హుక్కుకు సౌజన్య చున్నీతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మృతిపై అనుమానాలు
సౌజన్య మృతిపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం మధ్యాహ్నం మృతి చెందితే సాయంత్రం 5 గంటలకు ఆమె తండ్రికి గిరిప్రసాద్ తెలియపరచాడని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులకు కూడా సాయంత్రమే సమాచారం అందడంతో సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా వరకట్న వేధింపుల కారణంగానే తమ కుమార్తె మృతిచెందిందని ఆమె తండ్రి విష్ణు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి పశ్చిమ ఏసీపీ నరసింహమూర్తి దర్యాప్తు చేస్తున్నారు.