ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్టైందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బయోమెట్రిక్ పెట్టారన్న కోపంతో ఉద్యోగులు.. టీడీపీ ని కాదని వైసీపీని నమ్మారు. ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ పెట్టినా.. జీతాలు ఇవ్వకపోయినా నోరెత్తలేని దుస్థితిలో ఉన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలే దండగన్న అభిప్రాయంతో జగన్ సర్కార్ ఉంది. అప్పులు పుడితే తప్ప, జీతాలు ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. జీతాలు, డీఏ బకాయిలు, జీపీఎఫ్ సొమ్ము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘ నేతలు నమ్మడం సిగ్గుచేటు. ఉద్యోగ సంఘ నేతలు, ఉద్యోగులు.. వారి కుటుంబాల గురించి ఆలోచించాలి. తోటివారికి జీతాలు ఇవ్వని ప్రభుత్వం, తమను ఉద్ధరిస్తుందని ఉద్యోగ సంఘ నేతలు భ్రమపడటం మూర్ఖత్వమే. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమాన్నే కోరుకుంటుంది.’’ అని తెలిపారు.