యస్ రాయవరం మండలంలోని రేవుపోలవరం తీరంలో ఆదివారం గల్లంతయిన విద్యార్ధి మృతదేహం లభ్యమైనట్లు బంధువులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకి తొండంగి మండలం వేమ వరం సముద్ర తీరం లోగుర్తించిన మెరైన్ పోలీసులు తొండంగి పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల 29న నర్సీపట్నం అయ్యన్న కాలనీకి చెందిన తొమ్మిదిమంది విద్యార్ధులు రేవుపోలవరం బీచ్ కు వచ్చారు. సముద్రంలో స్నానానికై దిగిన వారిలో కొమ్మోజు రేవంత్ (15) అలల ఉధృతికి గల్లంతయ్యాడు.
వెంటనే రంగంలోకి దిగిన మెరైన్ పోలీసు రెవెన్యూ శాఖలు గజఈతగాళ్ళతో గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. మంగళవారం ఉదయం తొండంగి మండలం వేమవరం వద్ద రేవంత్ మృతదేహాన్ని మత్స్యకారులు గుర్తించి మెరైన్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు మృతదేహాన్ని స్వాధీనపరచుకుని స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికపోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం రేవంత్ మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
రేవంత్ మృతదేహం దొరకడంతో బంధువులంతా తుని ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో ఆసుపత్రి ఆవరణ నిండిపోయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని యస్ రాయవరం పోలీసుల సమక్షంలో కుటుంబసభ్యులకు అప్పగించారు.