ఉపాధి హామీ పథకం కింద పనులు చేయించిన పిటిషనర్‌కు చెల్లించాల్సిన సొమ్మును తన బంధువులకు ఇచ్చిన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామసర్పంచి ఇంద్రసేనారెడ్డిపై ఏం చర్యలు తీసుకున్నారో ఆ వివరాలను తమ ముందు ఉంచాలని పంచాయతీరాజ్‌శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఈ ఆదేశాలిచ్చారు. విచారణను రెండువారాలకు వాయిదా వేశారు. గ్రామంలో చేయించిన ఉపాధి పనులకు బకాయిలు చెల్లించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ రమేష్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిటిషనర్‌కు బకాయిలు చెల్లించాలని 2021లోనే సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు అమలుకాకపోవడంతో కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు. మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. కాగా, బకాయిల చెల్లింపు సొమ్మును సర్పంచి దుర్వినియోగం చేశారని పంచాయతీరాజ్‌శాఖ తరఫు న్యాయవాది వాదించారు.