అనంతపురం జిల్లాలోని ఎస్సై, ఆపై స్థాయి పోలీసు అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లతో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సైబర్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశించారు. ఎస్పీ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా సంబంధిత నేరాలు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న నేరాలను అరికట్టే విషయాలపై సమగ్ర దర్యాప్తు కోసం నైపుణ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న కొత్త సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించు కోవాలన్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో ఉపయోగించాల్సిన నూతన టూల్స్ మీద నైపుణ్యం పెంపొందించుకోవాలని, తద్వారా ప్రజలకు సకాలంలో న్యాయం చేయగలమన్నారు. సైబర్ క్రైమ్ నేరాల గురించి ఫిర్యాదు వచ్చినప్పుడు ఏ విధంగా దర్యాప్తు చేయాలి, ఎటువంటి ఆధారాలు శాస్త్రీయ కోణంలో సేకరించాలని సూచనలు చేశారు.