‘అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒంగోలులో ఓ మహిళపై అత్యాచారం జరిగితే, నేరుగా ఎస్పీకి కాల్ చేసి 12గంటల్లో నిందితుడ్ని పట్టుకోవాలని ఆదేశించారు. ఆ భయానికి నిందితుడు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. నాయకుడిని బట్టే సమాజం ఉంటుందని చెప్పడానికి ఈ ఘటనలే నిదర్శనం’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో 900 మంది మహిళలపై దాడులు జరిగాయని, ఇది మారాలంటే జగన్‌ను శాశ్వతంగా ఇంటికి పంపించాలని ఆయన పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లెలో మహిళల సమావేశంలో లోకేశ్ ప్రసంగించారు. యువగళం పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర బుధవారం ఆరో రోజుకు చేరుకుంది. ఉదయం 9గంటలకు బైరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లె కస్తూర్బా పాఠశాల నుంచి పాదయాత్ర మొదలై పలమనేరు మండలంలోకి చేరింది. సాకేఊరు వద్ద చెరుకు రైతులు పడుతున్న ఇబ్బందులను వెంకటరమణ అనే రైతు లోకేశ్‌కు వివరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. బురుశెట్టిపల్లె వద్ద పనులు చేసుకుంటున్న తాపీ మేస్త్రీలు, కూలీలను లోకేశ్ వెళ్లి పలకరించారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడం, ఇసుక దొరక్కపోవడంతో పనుల్లేక తమ పరిస్థితి దుర్భరంగా మారిందని కూలీలు వాపోయారు. ఇసుక అక్రమ రవాణాతో వైసీపీ నాయకులు రూ.వేల కోట్లు సంపాదిస్తున్నారని, టీడీపీ రాగానే మళ్లీ ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అనంతరం వాల్మీకి సామాజికవర్గం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తమను ఎస్టీల్లో చేర్చే అంశాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని వారు వాపోయారు. సత్యపాల్ రిపోర్టు ఆధారంగా వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని లోకేశ్ గుర్తుచేశారు. దీనిపై సీఎం జగన్‌కు తాను స్వయంగా లేఖ కూడా రాశానన్నారు. నక్కపల్లెలో ప్రభుత్వం తలపెట్టిన రీసర్వేకు చెందిన రాళ్లను పరిశీలించిన లోకేశ్.... రీసర్వే పేరుతో ప్రభుత్వం కుంభకోణం చేస్తోందని ఆరోపించారు.