‘‘పార్లమెంటులో 31 మంది ఎంపీలు ఉన్న వైసీపీ రాష్ట్రానికి ఏం తెచ్చింది? విభజన హామీల అమలుకు కేంద్రంలో ఇదే చివరి బడ్జెట్. ఈ బడ్జెట్‌లో కూడా రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిధులు, నిర్ణయాలు ఉండేలా సాధించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయింది’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై బుధవారం ఆయన స్పందించారు. ‘‘మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రాజెక్టులకు ఆశించిన కేటాయింపులు లేకపోవడం నిరుత్సాహం కలిగించింది. కర్ణాటకలో కరువు ప్రాంతాల కోసం బడ్జెట్‌లో రూ.5,300 కోట్లు కేటాయించారు. విభజన చట్టం ప్రకారం ఏపీలో ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. దానిని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాలేదు. రాజధాని నిర్మాణానికి నిధులు తెచ్చుకోలేకపోయారు. విభజన హామీల అమలుపై నిర్ణయాలు ఏవీలేవు. వీటి కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో సీఎం జగన్‌రెడ్డి, వైసీపీ ఎంపీలు పూర్తిగా విఫలం అయ్యారు. సొంత కేసులు, స్వప్రయోజనాలపై మాత్రమే వారికి ఆసక్తి ఉందని మరోసారి రుజువైంది’’ అని ధ్వజమెత్తారు.