పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పదేళ్లుగా షేక్ చినమస్తాన్ వలి మోటర్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడు ఒకే పని చేస్తుంటే ఎలా అనుకున్నాడో ఏమో కొత్తగా చేతికి పని చెప్పారు. పెట్రోలుతో సంబంధం లేకుండా సోలార్‌తో బైక్‌ను రూపొందించారు. ఎండ లేని సమయంలోనూ పెట్రోల్ అవసరం లేకుండా బైక్ నడవాలని బ్యాటరీని ఏర్పాటు చేశారు. తీవ్రంగా పెరిగిపోయిన పెట్రోలు అవసరం లేకుండా సోలార్ సాయంతో బైక్ నడిపేందుకు కొన్ని పరికరాలు సమకూర్చుకొని వాహనాన్ని తయారుచేశారు. సోలార్ ప్యానల్ సాయంతో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వాహనం నడపడమే కాకుండా సూర్యాస్తమయం తరువాత కూడా 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించేందుకు వీలుగా బైక్‌ను తయారు చేశారు. ఆ తరువాత అవసరమై ప్రయాణం చేయాల్సి వస్తే విద్యుత్ చార్జింగ్ సాయంతో ద్విచక్ర వాహనాన్ని నడిపే విధంగా తయారు చేశారు. 300 వాట్స్ సోలార్ ప్లేట్, 58 వాట్స్ విద్యుత్ పవర్ సోలార్ ప్లేట్ నుంచి బ్యాటరీకి చేరుతుంది. బ్యాటరీలో ఎప్పుడూ 75 వాట్స్ చార్జింగ్ ఉండేలా చినమస్తాన్‌వలి రూపకల్పన చేశారు. ముగ్గురు మనుషులు లేదా రెండున్నర క్వింటాళ్ల బరువుతో ఓ మనిషి ద్విచక్ర వాహనాన్ని నడిపేందుకు వీలుగా వాహనం తయారు చేశారు. సుమారు లక్షా 30 వేల రూపాయల ఖర్చుతో ఐదు రోజులు శ్రమించి సోలార్ బైక్‌ను తయారు చేసినట్లు మస్తానవ్‌వలి తెలిపారు. వాహనం నడిపే వ్యక్తి పైభాగం లో ఏర్పాటుచేసిన సోలార్ ప్యానల్ సాయంతో ఎండకు, వానకు, దుమ్ము ధూళి నుంచి రక్షణ ఉండేటంతోపాటు సోలార్‌బైక్ కొత్తగా రూపొందించడంతో చూసేందుకు కొందరు ద్విచక్ర వాహనం ఔత్సాహికులు ఉవ్వీళ్లూరుతున్నారు.