విజయవాడ లో జరిగిన దోపిడీ బయటపడింది. ఇంట్లో పనికి వచ్చి వృద్ధ దంపతులను బెదిరించి దోపిడీకి పాల్పడిన భార్యాభర్తలను అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దోపిడీ జరిగిన 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి దోపిడీ సొత్తు స్వాధీన పరచుకున్నారు. వివరాల ప్రకారం.. రిటైర్డ్ ఉద్యోగి నెట్ల లక్ష్మీప్రసాద్ తన భార్యతో కలిసి రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్నారు. దంపతులు ఇల్లు మారే క్రమంలో ఇంట్లో పని నిమిత్తం సమీపంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన భార్యాభర్తలు అక్కరబోతు లీలాదుర్గ, అంజిబాబును పనికి కుదుర్చుకున్నారు. మంగళవారం ఇంటికి వచ్చి పని చేసిన అనంతరం వారు డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు. ఇంట్లో వృద్ధ దంపతులిద్దరే ఉండటం, మెడలో బంగారు వస్తువులు ఉండటాన్ని గమనించిన లీలాదుర్గ, అంజిబాబు బుధవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లి తలుపుతట్టారు. వృద్ధ దంపతులు తలుపు తీయగానే అమాంతం ఇంట్లోకి చొరబడి నోరు నొక్కేశారు. వృద్ధురాలి మెడలోని బంగారు తాడు, నల్లపూసలు, చెవి దిద్దులు లాక్కుని ఉడాయించారు. అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వివరాలను సేకరించారు. పనికి కుదిర్చిన మధ్యవర్తుల ద్వారా చోరీకి పాల్పడిన లీలాదుర్గ, అంజిబాబును అదుపులోకి తీసుకు న్నారు. వారి నుంచి 9 కాసుల బంగారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.