బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం గంజాయి హబ్ గా మారింది. నెలరోజుల వ్యవధిలో ఈ మండలంలోని రెండు గ్రామాలలో కేజీల కొద్దీ గంజాయి పోలీసులకు దొరకటం ఇక్కడ గమనార్హం. గత నెల 5వ తేదీన మండలంలోని మోటుపల్లి గ్రామంలో ఎంపీటీసీ కొండూరి గోవిందు ఇంట్లో 13 1/2 కేజీల గంజాయి దొరకగా అతనిని అతని తండ్రిని బాపట్ల రూరల్ పోలీసులు అరెస్టు చేయడం తెలిసింది. తాజాగా గురువారం రాత్రి ఇదే మండలంలోని కడవకుదురు గ్రామంలో పంది శివ అనే రైల్వే చిరు ఉద్యోగి ఇంట్లో 5 కేజీల గంజాయి దొరికింది. అతడిని చిన్నగంజాం ఎస్ఐ అనూక్ అరెస్టు చేసి గంజాయి స్వాధీనపరుచుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు చినగంజాం మండలానికి ఎలా ఎక్కడ నుండి ఎవరు గంజాయి సరఫరా చేస్తున్నారన్నది జవాబు దొరకని ప్రశ్నగా మారింది. లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఇంకొల్లు సీఐ సూర్యనారాయణ చెప్పారు. ఇదిలా ఉంటే కడవకుదురు లో గంజాయి స్వాధీనం వార్త జిల్లా ఎస్పీ జిందాల్ దృష్టికి వెళ్లిందా లేదా అన్నది అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే శుక్రవారం నాడు బాపట్లలో గంజాయి దొరకగా ఆ సమాచారాన్ని ఎస్పీ మీడియా వాట్సప్ గ్రూపులో పిఆర్ఓ పోస్ట్ చేశారు. కానీ చినగంజాం లో గంజాయి స్వాధీనం వార్త మాత్రం అందులో లేదు. ఈ తిరకాసు ఏమిటో అర్థం కావడం లేదు.