విద్యార్థులకు చదువుకు మాత్రమే పరిమితం కాకూడదు. చదువుతో పాటు క్రీడల్లోనూ పాల్గొంటే ఎన్నో లాభాలున్నాయి. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడానికి క్రీడలు దోహదపడతాయి. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం క్రీడలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విద్యార్థి జీవితంలో చాలా ఒత్తిడి ఉంటుంది. దానిని తగ్గించడానికి ఆటలు ఉపయోగపడతాయి. చాలా పాఠశాలల్లో విద్యకు ప్రాధాన్యత ఇచ్చి, క్రీడలను విస్మరిస్తారు. విద్యకు సమానంగా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి. క్రీడల వల్ల విద్యార్థులకు కలిగే ప్రధాన ప్రయోజనాలను తెలుసుకుందాం.
క్రీడలు ఆడటం వలన విద్యార్థులలో టీమ్ స్పిరిట్, లీడర్‌షిప్, జవాబుదారీతనం, సహనం, ఆత్మవిశ్వాసం వంటి నైపుణ్యాలను అలవడతాయి. జీవితంలో సవాళ్లు ఎదుర్కొనేలా రాటుదేలుతారు. చిన్నతనం నుండే విద్యార్థులకు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందుతారు. క్రీడలు ఎక్కువగా ఆడడం వల్ల ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశను పోగొట్టి, మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా సాయపడుతాయి. ఎముకలను పటిష్టంగా మార్చడంలో క్రీడలు ఉపయోగపడతాయి. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. ఊబకాయం వచ్చే ప్రమాదం ఉండదు.
క్రీడల్లో పాల్గొనే పిల్లలు ఎక్కువ పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటుంటారు. జంక్ ఫుడ్ తినే అవకాశాలు స్వల్పంగా ఉంటాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువగా క్రీడలు ఆడే పిల్లల్లో ఎండార్ఫిన్, డోపమైన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లు విడుదల అవుతాయి. ఫలితంగా అలసిపోయిన శరీరానికి ఇవి విశ్రాంతిని ఇస్తాయి. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగు పడతాయి. సామాజిక మరియు వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడేలా చేస్తాయి. లక్ష్యం కోసం పాటుపడేలా విద్యార్థులను ప్రోత్సహిస్తాయి. విద్యార్థులకు నీతి, విలువలు, క్రమశిక్షణ వంటివి అలవడతాయి. పరస్పర గౌరవం, నిజాయితీ, అంకితభావం వంటి అలవడతాయి.