వైసీపీలో ప్రతి జిల్లాలో గ్రూపు రాజకీయాలు ముదిరిపాకనపడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ వెల్లడించారు. కర్నూలు గ్రామీణ మండలంలోని ఉల్బాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. సుధాకర్‌పై మాజీ మండల అధ్యక్షుడు బుర్ర పెద్ద వెంకటేశ్ నాయుడు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలను పక్కనపెట్టారని, ఇతర పార్టీల నుంచి వచ్చిన రౌడీమూకలను అందలం ఎక్కించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ రావడానికి కష్టపడిన వారిని మరిచిపోయారని, సుధాకర్ నమ్మకద్రోహి అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు.
ఇంత నమ్మకద్రోహిని అసలు ఎక్కడా చూడలేదని, అన్యాయం చేసినందుకు సుధాకర్ మూల్యం చెల్లించుకుంటారని బుర్ర వెంకటేశ్ నాయుడు హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సుధాకర్ ప్రకటించడంతో స్దానిక నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సడెన్‌గా ప్రకటన చేయడంతో అందరూ నోరెళ్లబెట్టారు. ఎమ్మెల్యే సుధాకర్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సుధాకర్ తప్పుకున్నట్లు ప్రకటించడంతో.. కోడుమూరు వైసీపీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ టికెట్ కోసం ఇప్పటికే పలువురు పోటీ పడుతున్నట్లు సమాచారం.