ప్రతి రంగంలో దూసుకెళ్తున్న చైనా దేశం తాజాగా పాడి రంగంలోనూ తనదైన ముద్రవేసింది. అగ్రరాజ్యం కావాలని ఉవ్విళ్లూరుతోన్న చైనా శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక ఫలితాలను సాధిస్తోంది. ఇప్పటికే కృతిమ సూర్యుణ్ని రూపొందించి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన చైనా... కృతిమ చంద్రుణ్ని సైతం తయారు చేసింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా ఉన్న రెండో దేశమైన చైనా.. తన జనాభాకు సరిపడా పాల ఉత్పత్తులను తయారు చేసుకునే విషయంలో మాత్రం.. వెనుకంజలో ఉంది. ఇతర దేశాల నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడంతోపాటు.. ఆ దేశంలోని పాడి ఆవుల్లో 70 శాతం విదేశాల నుంచి తెప్పించినవే.
ఇదిలావుంటే పాల దిగుబడి విషయంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా చైనా కీలక ముందడుగేసింది. యానిమల్ క్లోనింగ్ సాయంతో ‘సూపర్ కౌ’ను చైనాలోని నార్త్ వెస్ట్ ఏ అండ్ ఎఫ్ యూనివర్సిటీ పరిశోధకులు సృష్టించారు. ఈ విధానంలో ఆవు చెవి భాగంలోని శరీర కణాలను ఉపయోగించి పిండాన్ని తయారు చేసి.. దాన్ని ముందుగానే నిర్దేశించుకున్న ఆవులో ప్రవేశపెట్టారు. క్లోనింగ్‌తో తయారు చేసిన గొర్రె పిల్ల అయిన ‘డాలీ’ని సైతం ఇలాగే క్రియేట్ చేశారు.
ఇటీవలే మూడు సూపర్ కౌ లేగ దూడలను చైనా విజయవంతంగా క్లోన్ చేసింది. ప్రపంచంలోకెల్లా ఎక్కువ ఆవుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కెనడియన్ హోలిస్టియన్ ఆవుల కంటే ఇవి 50 శాతం ఎక్కువ పాల దిగుబడి ఇస్తాయని చైనా చెబుతోంది. ఈ సూపర్ ఆవులు ఏడాదికి 18 టన్నుల పాలు ఇస్తాయట. ఆవు ఏడాదికి 305 రోజులు పాలు ఇస్తుందనుకుంటే రోజుకు 150 లీటర్లకుపైగా పాలు ఇస్తాయని డ్రాగన్ చెప్పడం గమనార్హం.
హోలిస్టియన్ ఆవుల నుంచి.. మేలైన లక్షణాలున్న.. ఎక్కువ పాలిచ్చే.. దీర్ఘకాలం బతికిన.. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొన్న వాటిని గుర్తించి.. వాటి నుంచి టిష్యూలను సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ మెథడ్ ద్వారా క్లోనింగ్ చేసిన పరిశోధకులు.. అధిక పాల దిగుబడిని ఇచ్చే ఆవులను తయారు చేశారని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. వచ్చే రెండు మూడేళ్లలో వెయ్యికిపైగా ‘సూపర్ కౌ’లను తయారు చేయాలని చైనా భావిస్తోంది.
జనవరి చివరి వారంలో లింగ్వూ సిటీలో ఈ ‘సూపర్ కౌ’లు జన్మించగా.. మొదటి లేగ దూడ 56.7 కిలోల బరువు, 76 సెంటిమీటర్ల ఎత్తుతో జన్మించింది. బరువు ఎక్కువగా ఉండటంతో దాన్ని సిజేరియన్ ద్వారా బయటకు తీశారు. తాము కావాలనుకున్న విధంగానే ఈ లేగ దూడ పుట్టిందని పరిశోధకులు తెలిపారు. ఇదిలావుంటే చైనా నేచర్‌తో గేమ్స్ ఆడుతోందని.. ఈ ఆవుల ద్వారా కొత్త వ్యాధులు వచ్చే ప్రమాదం లేకపోలేదని కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.