డీజీపీ సహా పలువరికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదిలావుంటే టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తనకు సెక్యూరిటీ తగ్గించడాన్ని సవాల్ చేయగా.. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శితో పాటూ డీజీపీ, ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ, ఐజీ, అనంతపురం ఎస్పీ, ఐబీ డిప్యూటీ డైరెక్టర్, రాష్ట్రస్థాయి భద్రతా సమీక్ష కమిటీకి నోటీసులు జారీ చేసింది.
పయ్యావుల కేశవ్‌కు నక్సల్స్ నుంచి ముప్పు ఉందన్న కారణంగా 1994 నుంచి భద్రత కల్పిస్తున్నారని లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2+2గా ఉన్న భద్రతను 1+1కి కుదించిందని.. గతేడాది జులై నుంచి పూర్తిగా తొలగించింది అన్నారు. వ్యక్తిగత భద్రతాధికారిని మార్చామన్న కారణంగా మరో భద్రతా సిబ్బందిని పిటిషనరే వెనక్కి పంపించారని.. ప్రభుత్వం తొలగించిందన్న వాదన సరికాదని ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు.
ప్రభుత్వం తనకు సెక్యూరిటీని తొలగించిందని పయ్యావుల ఆరోపిస్తున్నారు. తన భద్రతా సిబ్బందిని పునరుద్ధరించాలని గతంంలో ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడంలేదని.. తిరిగి తనకు 2+ 2 సెక్యూరిటీని పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతున్నారు. అయితే నిబంధనల మేరకు కేశవ్ కు 1 ప్లస్ 1 భద్రత కొనసాగుతోందని.. ఆయన భద్రత ఉపసంహరించాలన్న ఆలోచన లేదన్నారు పోలీసులు. ఆయన మాత్రం 2+2 భద్రతను కోరుతున్నారు.