తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో.. స్వల్ప ఉద్రిక్తత నెసకొంది. చిత్తూరు జిల్లా ఎన్‌ఆర్‌పేట ఎన్టీఆర్ కూడలిలో సభ నిర్వహణకు అనుమతి లేదంటూ.. నారా లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. జీవో-1 ప్రకారం రోడ్లపై సమావేశానికి అనుమతి లేదని చెప్పడంతో టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. ఎన్టీఆర్ కూడలిలోనే తనను కలవడానికి వచ్చిన ప్రజల్ని ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు.
సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ పెట్టాలని నారా లోకేష్ ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టుకోవాలా? అని పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో లోకేష్ చేతిలో మైకు లాక్కోవడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. లోకేష్ పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డుపడుతున్నారని.. నిబంధనల పేరుతో వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో.. ముఖ్యమంత్రి జగన్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. సొంత ఊరిలో బస్టాండ్ కూడా కట్టలేని నువ్వు రాయలసీమ బిడ్డవా అంటూ ప్రశ్నించారు. రూల్స్ అంటూ తన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులకు రాజ్యాంగాన్ని చదివి వినిపించారు. వైసీపీ నేతలకు లేని రూల్స్ తమకు పెడతామంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. కొందరు పోలీసులు (Police) రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. జగన్ రెడ్డికి భయం అంటే ఏంటో చూపిస్తా అని లోకేష్ వ్యాఖ్యానించారు.