వెట్టిచాకిరి రహిత రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను తీర్చిదిద్దటమే లక్ష్యంగా వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలన చట్టం - 1976 అమలులోకి వచ్చిన ఫిబ్రవరి 9వ తేదీని "వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలన దినము" గా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రకటించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆద్వర్యంలోని నేర దర్యాఫ్తు విభాగము వారు ఈ వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలన కోసం "ఆపరేషన్ స్వేచ్ఛ" అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని ఒక వారం (వెట్టి చాకిరి నిర్మూలన వారం) రోజులు పాటు అనగా ఈనెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు అన్ని జిల్లాల్లోని పోలీస్, ఇతర శాఖల సమన్వయంతో నిర్వహించ తలపెట్టినారు.
ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం నుండి జిల్లా మానవ అక్రమ రవాణా నివారణ విభాగంవారి ఆధ్వర్యంలో జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించతలపెట్టినారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జెండా ఊపి పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) బిందుమాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా భారత రాజ్యాంగం అనుగ్రహించిన హక్కులని అనుభవించడానికి అర్హుడు. ఎవరికి ఎవరిని నిర్బంధించి ఏపని చేయించుకునే అధికారం లేదు. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా చేస్తే వారు చట్టపరంగా శిక్షార్హులు. వెట్టిచాకిరిలో మగ్గుతున్న పిల్లల్ని విడిపించి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి, పెద్దవారిని విడిపించి వారికి స్వేచ్ఛ జీవితాన్ని కల్పించడానికి ప్రతి ఒక్కరు వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది, విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేపించారు.