‘‘రాష్ట్రంలో ఖాయంగా ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేసుల నుంచి కాసుల దాకా అనేక సమస్యల్లో కూరుకుపోయి ఉన్నారు. అవి తనను ముంచేయక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆయన నిర్ణయుంచుకున్నారు. అంతకుమించి ఆయనకు గత్యంతరం లేదు. మేం కూడా దీనికి సిద్ధపడుతున్నాం. ఈ రోజు నుంచే పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాం. రేపు ఎన్నికలు జరిగినా టీడీపీకి 160 సీట్లు ఖాయం. జగన్ రెడ్డి మాదిరిగా 175 సీట్లు వస్తాయని అతిశయోక్తులు చెప్పుకోవడం మాకు అలవాటు లేదు’’ అని టీడీపీ వ్యూహ కమిటీ ప్రకటించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం అమరావతిలోని ఆయన నివాసంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు విలేకరులతో మాట్లాడారు.