అదానీ గ్రూప్ కంపెనీల సంస్థకు కేబినెట్ భేటీలో భూ సంతర్పణ చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలం పెద్దకోట్ల, దాడితోట గ్రామాల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు 500 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు 406.46 ఎకరాల భూమిని, ఎకరం రూ.5లక్షల చొప్పున కేటాయించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే... ఈ ప్రాజెక్టు కోసం కడప జిల్లాలో 470 ఎకరాలు, మన్యం పార్వతీపురం జిల్లాలో 362 ఎకరాలు...ఇదే జిల్లాలో మరో 318 ఎకరాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం మరో 60.29 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. విశాఖలో డేటా సెంటర్ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఏర్పాటుచేసిన ‘వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ (వీటీపీఎల్)’కు ఈ భూమి కేటాయిస్తున్నట్టు పేర్కొంది. ఈ భూమిలో రూ.7,210 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల డేటా సెంటర్, బిజినెస్ పార్కు, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటుచేసి, 14,285 మందికి ఉపాధి కల్పించాల్సి ఉంటుందని తెలిపింది. భూమితో పాటు ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో మినహాయింపులు, రాయితీలు ఇవ్వనున్నట్టు మంత్రివర్గం ప్రకటించింది.