గుంతకల్లు ఆర్టీసీ డిపోకు డీజిల్ సరఫరా చేసే కాంట్రాక్టును హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి పొందారు. డిపో ఆర్డరు మేరకు గార్లదిన్నెలోని మణికంఠ కేఎ్‌సకే డీలర్స్ పెట్రోలు బంకు నుంచి డీజిల్‌ను సరఫరా చేయాల్సి ఉంది. 12 వేల లీటర్ల డీజిల్‌తో ఓ ఆయిల్ ట్యాంకరు శనివారం డిపోకు వచ్చింది. అన్‌లోడ్ చేసే సమయానికి రెవెన్యూ అధికారులు తనిఖీకి వచ్చారు. డిపో మేనేజరు నారాయణస్వామి ఆధ్వర్యంలో ఆర్టీసీ సిబ్బంది రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. అనుమతిలేనిదే లోపలకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఇంతలో డీజిల్ కాంట్రాక్టరు, ట్రక్కు నిర్వాహకులు అక్కడకు వచ్చారు. దీంతో డీజిల్ సరఫరాకు సంబంధించి పత్రాలను ఇవ్వాలని డిప్యూటీ తహసీల్దార్లు ఆదినారాయణ, సుబ్బలక్ష్మి, వీఆర్వో తలారి కృష్ణ అడిగారు. అయితే, రెవెన్యూ అధికారి సుబ్బలక్ష్మిపై కాంట్రాక్టరు చిందులు తొక్కారు. కాగా, కర్ణాటక నుంచి డీజిల్ తెచ్చి, ఏపీలో ఇన్వాయి్‌సలు, వేబిల్లు తీసుకుని అక్రమదందా నడుపుతున్నారనే అనుమానాలు వ్యక్తంఅవుతున్నాయి. గుంతకల్లుకు దాదాపు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న గార్లదిన్నె పెట్రోలు బంకు నుంచి కాకుండా, 218 కిలో మీటర్ల దూరంలో,వేరే జిల్లాలో ఉన్న మడకశిర నుంచి డీజిల్ తీసుకురావడం అనుమానాలకు తావిస్తోంది. గుంతకల్లు డిపోకు డీజిల్ సరఫరా చేసే విషయంలో స్థానిక ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.