మనదేశంలోని కీలక విభాగాలలో ఇటీవల హనీ ట్రాప్ కలకలం పెద్ద దుమారం రేపుతుంది. తాజాగా ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా సునాబెడలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) లో హనీట్రాప్ కలకలం రేగింది. ఈ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు హనీట్రాప్ లో చిక్కుకున్నారని సమాచారం. కంపెనీకి చెందిన కీలక సమాచారాన్ని ఈ ఉద్యోగులు లీక్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాసిక్ కు చెందిన ఓ యువతి వీరిపై వలపు వల విసిరి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం హెచ్ఏఎల్ ఉద్యోగులు ఇద్దరినీ సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
నాసిక్ లోని ప్రధాన కార్యాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు నలుగురు సీబీఐ అధికారులు శనివారం సునాబెడ చేరుకున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో పనిచేస్తున్న సీనియర్ అధికారి సత్యజిత్ ఖడంగాతో పాటు మరో ఉద్యోగి దేబాశిస్ కుమార్ నాయక్ లను అధికారులు అరెస్టు చేశారు. రక్షణ శాఖ పరిధిలోని హెచ్ఏఎల్ కంపెనీలో పలు కీలకమైన పత్రాలను లీక్ చేసిన ఆరోపణలపై వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు అధికారవర్గాల సమాచారం. హనీట్రాప్ వివరాలను, ఏయే పత్రాలలోని సమాచారాన్ని లీక్ చేశారనే దానిపై వారిని విచారిస్తున్నట్లు తెలిసింది.