జనసేన వర్సెస్ ఏపీ మంత్రి రోజూ అన్నట్లుగా వార్ గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసింది. ఈ క్రమంలోనే మంత్రి రోజా, జనసేన నేతల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. పర్యాటక శాఖ మంత్రి రోజా ఇటీవల నిండ్ర మండలంలోని రెండు గ్రామాల్లో తాగునీటి బోరు, పైపు లైన్లను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మంత్రి రోజా వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం ఫొటోను మార్ఫింగ్ చేసిన కొందరు.. ‘వైఎస్ఆర్ పోలవరం’ ప్రాజెక్టును మంత్రి ప్రారంభించారంటూ సెటైర్లు వేశారు.
ఇదే ఫొటోను ట్వీట్ చేసిన జనసేన నేత నాగబాబు.. మంత్రి గారు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును ప్రారంభించారంటూ సెటైర్లు వేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీ జిల్లాల ప్రజల దాహార్తి తీర్చడంతోపాటు 6 లక్షల ఎకరాలకుపైగా సాగు నీరు అందించారని సమాచారం అంటూ ‘హంద్రీనీవా’ను పూర్తి చేయలేకపోవడంపై వ్యంగాస్త్రాలు సంధించారు.
నాగబాటు ట్వీట్ పట్ల మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. నీటి కోసం ఆ గ్రామాల ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. సుదూర ప్రాంతం నుంచి పైప్ లైన్ లాగి వారికి తాగునీటిని అందించామని చెప్పారు. నాగబాబును ట్విట్టర్లో ట్యాగ్ చేసిన ఆమె.. గాడిదకేం తెలుసు గంధపు వాసన అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నేను కాబట్టి ఈ వివరాలు చూపిస్తున్నా కానీ.. ఆ ఊరికెళ్లి ఈ వెటకారం మాటలు మాట్లాడితే తగిన రీతిలో గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు.
మంత్రి రోజా ట్వీట్‌కు నెటిజన్లు, జనసైనికులు ఘాటుగా బదులిస్తున్నారు. ఈ ఐదు దశాబ్దాల్లో మీరే దాదాపు పదేళ్లపాటు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న విషయం మర్చిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. ‘‘2014లో నువ్వు గెలిచావ్.. 2019లో మళ్లీ గెలిచింది నువ్వే.. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. పదేళ్లపాటు నువ్వే ఆ ప్రాంత ఎమ్మెల్యేవి. మంత్రి కాగానే ఒక సంవత్సరంలో బెంజ్ కారు కొన్నావు. కానీ ఒక ఊరికి తాగు నీరు అందించడానికి పదేళ్లు పట్టిందంటే ఇప్పటి వరకూ గాడిదలు కాస్తున్నావా?’’ అని జనసేన నేత డాక్టర్ పంచకర్ల సందీప్ ఘాటుగా బదులిచ్చారు. ఈ ట్వీట్‌ను నాగబాబు రీట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే రాజేశ్ మహాసేన జనసేనలో చేరతారని భావించగా.. ఆయన టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన గురించి జనసైనికులు ఎవరూ తప్పుగా మాట్లాడొద్దని నాగబాబు సూచించారు. అతడు ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాడనేది అతడి ఇష్టమన్న నాగబాబు.. అది తన ప్రజాస్వామ్య హక్కు అన్నారు. అతడి నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు.