పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం లక్షలాది ఇల్లు కట్టించిందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకి అందజేస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరికొన్ని ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు.
రోడ్లు, రైల్వే, జల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఇస్తోందని, కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ఆ డబ్బును జీతాలకు వాడుకుంటోందని టీజీ వెంకటేష్ ఆరోపించారు. గత బడ్జెట్లో, ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 70 వేల కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు.. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోకుండా ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొస్తోందని టీజీ వెంకటేష్ విమర్శించారు.
ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు భారీగా నిధులు ఇస్తోందని టీజీ వెంకటేష్ చెప్పారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం లేదని, దీంతో ఆ ఫండ్స్ వెనక్కి వెళ్తున్నాయని పేర్కొన్నారు. ఇక, కొందరు నాయకుల తీరు వల్ల కర్నూలు శివారులోని రైల్వే రీ హ్యాబిటేషన్ సెంటర్‌కు ఆటంకం కలుగుతోందన్నారు. దీని వల్ల కాంట్రాక్టర్లు పనులు చేయలేక పోతున్నారని టీజీ వెంకటేష్ ఆరోపించారు.