సినిమాలో తరహా అద్భుతాలు నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు చోటు చేసుకుంటుంటాయి. నెల్లూరు జిల్లా కలువాయ మండలం ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన దండు బుచ్చయ్య-వరలక్ష్మి దంపతుల కుమారుడు సంజు.. 20 నెలల ఎట్టకేలకు కన్నవారి చెంతకు చేరాడు. దీంతో బుచ్చయ్య-వరలక్ష్మి దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక లేడు అనుకున్న పసివాడు.. తిరిగి తన ఒడికి చేరడంతో.. ఆ తల్లి ఆనందంతో పొంగిపోయింది. సంజు.. 2021 జూన్ 29 నుంచి కనిపించకుండా పోయాడు. ఉయ్యాలపల్లి గ్రామానికి సమీపంలోని అడవిలో తప్పిపోయాడని అంతా భావించారు. అప్పుడు సంజుకు మూడేళ్లు. అమ్మా.. నాన్న అనడం తప్ప.. ఇంకా మాటలు రావు. అలాంటి సమయంలో.. సంజు మిస్సయ్యాడు. బుచ్చయ్య తనకున్న గొర్రెలను మేపుకుంటూ కుటుంబ పోషణ సాగించేవారు. ఉదయాన్నే వాటిని తీసుకుని సమీపంలోని అడవిలోకి వెళ్లి.. సాయంత్రానికి ఇంటికి వచ్చేవారు.
అయితే.. ఉదయాన్నే ఇంటి దగ్గర బయలుదేరే సమయంలో బుచ్చయ్యతో పాటుగా సంజు కూడా సరదాగా కొంత దూరం వరకు వెళ్లేవాడు. బుచ్చయ్య గొర్రెలతో అడవిలోకి వెళ్లగానే.. సంజు వెనక్కి వచ్చేవాడు. అది సంజుకు అలవాటుగా మారింది. కానీ.. 2021, జూన్ 29న మాత్రం సంజు తండ్రితో వెళ్లలేదు. తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడేమో తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ.. కొంతసేపటి తర్వాత ఒంటరిగా అడవిలోకి వెళ్లాడు. ఆ తర్వాత మళ్లి వెనక్కి రాలేదు.
దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో.. అడవిలో వెతికారు. ఎంత వెతికినా బాలుడు ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో జూన్ 29న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మొదటి అటవీ ప్రాంతమంతా గాలించారు. అడవిలోకి వెళుతుండగా బాలుడిని చూసినట్టు చెప్పిన వారి నుంచి వివరాలు సేకరించారు. ఆ తర్వాత డ్రోన్లు కూడా ఉపయోగించారు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలో దింపారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. ఆ పసివాడు ఇక లేడని అంతా అనుకున్నారు.
ఇలా దాదాపు 20 నెలలు గడిచిపోయాయి. అంతలోనే ప్రకాశం జిల్లా పామూరు మండలం కృష్ణాపురంలో సంజు ఆచూకీ లభించింది. కడప జిల్లా తోపుగుంటకి చెందిన వారి ద్వారా.. సంజు కృష్ణాపురంలో ఉన్నట్లు తల్లిదండ్రులకు సమాచారం చేరింది. వెంటనే ఆ గ్రామానికి వెళ్లిన తల్లిదండ్రులు.. తమ కుమారుడిని తీసుకొచ్చారు. 'కృష్ణాపురంలో ఉన్నాడని తెలిసి వెళ్లాము. ఎవరో అమ్మినట్టు వారు చెప్పారు. మా బిడ్డ ఆనవాళ్లు చెప్పడంతో అప్పగించారు. ఇక లేడని అనుకున్న మా బాబు ఇంటికి వచ్చాడు. మాకు అంతే చాలు' అంటూ సంజు తల్లి ఆనందం వ్యక్తం చేశారు.