ఏపీ బాధ్యతలనుంచి వైదొలిగిన గవర్నర్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశంశాలతో ముంచెత్తారు. మచ్చలేని వ్యక్తిత్వం బిశ్వభూషణ్ హరిచందన్ సొంతమని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను దాటుకుని.. రాష్ట్రం ప్రగతి పథంలో పయనించడానికి మరువలేని సహకారాన్ని అందించారని గుర్తు చేశారు. అధికార కార్యకాలాపాల నిర్వహణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా.. నిండైన హుందాతనంతొ వ్యవహరించారని వివరించారు. రాష్ట్రం- కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంలో.. వాటి మధ్య సంబంధాలు సజావుగా సాగడంలో అత్యంత కీలక పాత్ర పోషించి.. రాజ్యాంగానికి బిశ్వభూషణ్ హరిచందన్ వన్నెతెచ్చారని.. జగన్ అభిప్రాయపడ్డారు. తనపై తండ్రి వాత్సల్యాన్ని చూపారని.. ఆత్మీయతను తెలుగు ప్రజలకు పంచారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. రాష్ట్రం నుంచి బిశ్వభూషణ్ హరిచందన్ వెళ్లిపోవడం బాధాకరమైనా.. దేశంలో మరో రాష్ట్రానికి ఆయన గవర్నర్‌గా వెళ్లడం.. అక్కడి ప్రజలకు తప్పకుండా మేలు చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.