అప్పుడప్పుడు కొందరు పోలీసు ఉన్నతాధికారుల తీరు వివాదాస్పత్రం అవుతోంది. తాజాగా ఏపీలోని అనకాపల్లి డీఎస్పీ బి. సునీల్ కుమార్ తీరు వివాదస్పదమైంది. గంజాయి కేసులో పట్టుబడిన ఓ నిందితుడికి చెందిన వాహనాన్ని (కారు) సొంతానికి వాడుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కారు నెంబర్ ప్లేట్ మార్చి కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు విశాఖ బీచ్‌కు వెళ్లటం విమర్శలకు దారి తీస్తుంది. విశాఖ బీచ్‌లో మరో వాహనాన్ని డీఎస్పీ తీసుకెళ్లిన కారు ఢీ కొట్టడంటో ఈ వ్యవహారం బయటపడింది. సీజ్ చేసిన వాహనాన్ని సొంతానికి వాడుకోవటమే కాకుండా.. దానికున్న నెంబర్ ప్లేట్ మార్చటంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో గతేడాది కొందరు దుండగులు కారులో గంజాయిని అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు. కశింకోట వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులను చూసి కారును అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు. పోలీసులు ఆ కారును సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. జి.మాడుగులకు చెందిన సుల్తాన్ అజారుద్దీన్ పేరుతో సీజ్ చేసిన కారు రిజిస్టరై ఉంది. రాజస్థాన్‌కు చెందిన సింగ్ అనే వ్యక్తి జి.మాడుగులలోనే ఉంటూ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసుల విచారణ తేలింది.
ఈకేసు విచారణ కోసం గతేడాది నవంబర్‌లో సింగ్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిచారు. అతడు మరో కారులో స్టేషన్‌కు వచ్చి పోలుసుల ఎదుట హాజరయ్యాడు. విచారణలో అతడు నేరం చేసినట్లు నిరూపితం కావటంతో అతడిని వెంటనే అరెస్టు చేశారు. అయితే తాను స్టేషన్‌కు వేసుకొచ్చిన కారును తన తల్లికి అప్పగించాలని పోలీసులను సింగ్ కోరాడు. రెండ్రోజుల తర్వాత కారను అప్పగించేందుకు సింగ్ తల్లి గురించి వాకబు చేయగా.. ఆమె స్వస్థలం రాజస్థాన్ వెళ్లిపోయారని తెలిసింది. దీంతో పోలీసులు ఆ కారును అనకాపల్లి రూరల్ పోలీసు స్టేషన్‌లో పార్క్ చేశారు. ఇక అప్పటి నుంచి స్టేషన్‌లోని పోలీసులు ఆ కారును తమ సొంతానికి వాడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 1న అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుటుంబ సభ్యులతో కలిసి ఆ కారు తీసుకుని ఎంజాయ్ చేసేందుకు గాను విశాఖపట్నం వెళ్లారు. బీచ్ రోడ్డులో డీఎఎస్పీ తీసుకెళ్లిన కారు మరో వాహనాన్ని ఢీకొట్టగా.. అక్కడున్న వారు ఆ దృష్యాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారం రచ్చ కెక్కింది. ఈఘటనపై అనకాపల్లి ఎస్పీ గౌతమి స్పందించారు. డీఎస్పీ సునీల్ గంజాయితో పట్టుబడిన నిందితుడు సింగ్ కారులో ప్రయాణించినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. నిందితుడి కారును సొంతానికి వాడుకోవడం ఒక నేరమైతే.. నంబరు ప్లేట్ మార్చడం మరో నేరంగా భావించి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు చెప్పారు.
అయితే డీఎస్పీ సునీల్ కుమార్ వాదన మాత్రం మరోలా ఉంది. తాను అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలంటే పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆ కారును పంపారని ఆయన చెప్పారు. కారు నంబరు ప్లేట్ మార్చిన విషయం తనకు తెలియదన్నారు.