తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని యోచిస్తున్నా కాంగ్రెస్ అధినాయకత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తన కీలక కమిటీల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చింది. నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్ నేతలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కీలక కమిటీలో చోటు దక్కించుకున్నారు. ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల కోసం పలు కమిటీలను తాజాగా అధిష్టానం ఏర్పాటు చేసింది. ఇందులో రాజకీయ వ్యవహారాల ఉపకమిటీలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఉత్తమ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ మాజీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా ఈ కమిటీలో ఉన్నారు.
రాజకీయ వ్యవహారాల ఉపకమిటీకి వీరప్పమొయిలీ ఛైర్మన్‌గా ఉండగా... అశోక్ చవాన్ కన్వీనర్‌గా ఉన్నారు. ఈ కమిటీలో 20 మంది సభ్యులను నియమించారు. ఇక ముసాయిదా కమిటీలో ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు కొప్పుల రాజుకు అవకాశం దక్కింది. ఆర్ధిక వ్యవహారాల ఉపకమిటీలో జేడీ సీలం, సంజీవరెడ్డిని సభ్యులుగా నియమించారు. అంతర్జాతీయ వ్యవహారాల ఉపకమిటీలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజుకి అవకాశం దక్కింది.
ఇక సామాజిక న్యాయం సాధికారత వ్యవహారాలకు సంబంధించి ఉపకమిటీ ఛైర్మన్‌గా ముకుల్ వాస్నిక్‌ను నియమించగా.. ఇందులో కన్వీనర్‌గా కొప్పుల రాజుకి అవకాశం ఇచ్చారు. ఇక రైతులు, వ్యవసాయ వ్యవహారాల ఉపకమిటీకి కన్వీనర్‌గా రఘువీరారెడ్డికి అవకాశం ఇవ్వగా.. ఇందులో 14 మంది సభ్యులను నియమించారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు సీనియర్ నేతలకు పలు కమిటీలలో చోటు దక్కింది. కమిటీల నియామకంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆదేశాలతో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.
ఇది ఇలా ఉంటే ఈ నెల 22 నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతం, ప్రజల సమస్యలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు.