వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల ఆధ్వర్యంలో వివేకా హత్య కేసులో సాక్షాధారాలు ధ్వంసం చేయటం వాస్తవం కాదా? అని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నిలదీశారు. సాక్షాధారాలు ధ్వంసం చేయడం ద్వారానే వివేకా హత్యలో వైఎస్ అవినాష్రెడ్డి పాత్ర ఉందని స్పష్టమవుతోందన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి గొడ్డలిపోటు వల్ల చనిపోతే.. గుండెపోటు అని వైఎస్ జగన్ సొంత ఛానల్‌లో ఎందుకు వేశారని ప్రశ్నించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన సతీమణి వైఎస్ భారతికి సంబంధం లేకపోతే వారి కాల్‌డేటా బయటపెట్టాలంటూ సీబీఐని కోరాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు.. అర్ధరాత్రి 3 గంటల సమయంలో కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి.. సీఎం జగన్, ఆయన సతీమణి భారతికి ఫోన్ చేసి ఏం మాట్లాడారని ప్రశ్నించారు.
అలాగే, శివశంకర్రెడ్డిని వైసీపీ నుంచి ఎందుకు బహిష్కరించలేదని చినరాజప్ప ప్రశ్నించారు. అలాగే, సీఎం జగన్ అండ లేకుండా సీబీఐ అధికారులపై అక్రమ కేసులు పెట్టడం సాధ్యమా అని నిలదీశారు. కడప ఎంపీ టికెట్ కోసమే ఈ హత్య జరిగిందని సీఎం జగన్ సోదరి, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీబీఐకి చెప్పలేదా? అని చినరాజప్ప ప్రశ్నించారు.
మరోవైపు వివేకా హత్య కేసుపై తెలుగు దేశం పార్టీ ఓ పుస్తకం విడుదల చేసింది. ‘జగనాసుర రక్త చరిత్ర బహిరంగం’ పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పంచుమర్తి అనురాధ, బోండా ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో సీఎం జగన్‌ను టార్గె్ట్ చేస్తూ టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు