మనదేశంలో భారీ మొత్తంలో లిథియం నిక్షేపాలను గుర్తించడంతో భారతదేశ ముఖచిత్రం మారిపోయే అవకాశం ఉంది.లిథియం ఖనిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండే దానికి కారణం. ఇదిలా ఉంటే జమ్మూ కశ్మీర్లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో లిథియం నిల్వలను గుర్తించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎలక్ట్రిక్ వాహనాలు, ఫోన్ల బ్యాటరీల తయారీలో లిథియంను ఉపయోగిస్తారు. జమ్మూ, శ్రీనగర్ మధ్యలోని రియాసీ జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో ఈ ఖనిజ నిక్షేపాలను గుర్తించారు. ప్రపంచంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశం చిలీ. ఆ దేశంలో 9.2 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉండగా.. ఆస్ట్రేలియాలో 5.5 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా, చిలీ, చైనా దేశాలు పెద్ద మొత్తంలో లిథియాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి.
ఆవర్తన పట్టికలోనూ ఉండే ఈ మూలకాన్ని 1817లో జోహాన్ అగస్ట్ అర్ఫెడ్‌సన్ గుర్తించారు. గ్రీక్‌లోని లిథోస్ అనే పదం నుంచి లిథియం అనే పదం పుట్టింది. లిథోస్ అంటే రాయి అని అర్థం. తక్కువ సాంద్రతతో ఉండే ఈ ఖనిజం తీవ్రంగా చర్యనొందుతుంది. అందుకే ఇది సహజంగా ఖనిజం రూపంలో లభ్యం కాదు. ఇది విషపూరితమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అన్ని ఖనిజాల్లోకెల్లా తేలికైన లిథియం సాంద్రత.. నీటి సాంద్రతలో సగం ఉంటుంది.
మిగతా ఖనిజాల మాదిరిగా లిథియం భూమ్మీద సహజంగా ఏర్పడదు. ప్రకాశవంతమైన నక్షత్ర పేలుడు నుంచి ఈ అంతరిక్ష మూలకం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బిగ్ బ్యాంగ్ కారణంగా విశ్వం ఆవిర్భవించిన తొలి నాళ్లలో కొద్ది మొత్తంలో లిథియం ఏర్పడిందని నాసా నిధులు సమకూర్చిన ఓ అధ్యయనం గుర్తించింది. నక్షత్ర పేలుడుకు కారణమైన న్యూక్లియర్ రియాక్షన్లలో లిథియం తయారై.. గెలాక్సీ మొత్తం వ్యాపించిందని భావిస్తారు.
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నందున.. ప్రపంచ వ్యాప్తంగా లిథియంకు సైతం డిమాండ్ పెరుగుతోంది. దీంతో ప్రపంచంలో లిథియం నిల్వలు ఎక్కడున్నాయనే అన్వేషణ తీవ్రమవుతోంది. ప్రస్తుతం ఉన్న కర్బన ఉద్గారాల ప్రకారం చూస్తే.. ఈ ప్రపంచానికి 200 కోట్ల ఎలక్ట్రికల్ వాహనాలు అవసరం అని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అంచనా వేసింది. 2025 నాటికి లిథియం కొరత ఏర్పడే అవకాశం ఉంది. 2030 నాటికి దేశంలోని కొత్త వాహనాల్లో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుంది.
ప్రస్తుతం భారత్ విదేశాల నుంచి లిథియం దిగుమతి చేసుకుంటోంది. జమ్మూ కశ్మీర్లో భారీ స్థాయిలో లిథియం నిల్వలలను గుర్తించడంతో.. ఇక మీదట ఆ ఇబ్బందులు తప్పుతాయి. లిథియం ఖనిజాన్ని వెలికి తీయడానికి పెద్ద మొత్తంలో నీరు అవసరం. కానీ ప్రపంచవ్యాప్తంగా లిథియం నిల్వలు ఉన్న దేశాలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. భారత్‌లో, ముఖ్యంగా కశ్మీర్లో నీటి కొరత ఉండదు కాబట్టి.. లిథియం ఉత్పత్తిలో భారత్ మిగతా దేశాలకు ప్రత్యామ్నాయం కాగలదు.
ఒక్క ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా వైద్య రంగంలోనూ లిథియం ఖనిజాన్ని ఉపయోగిస్తున్నారు. ఫోన్ బ్యాటరీలు, సోలార్ ప్యానెళ్లు ఇతర పునరుత్పాదక సాంకేతికతల్లోనూ లిథియాన్ని వాడుతున్నారు. గ్లాస్2లు, సిరామిక్స్‌ను దృఢంగా రూపొందించడానికి, ఉష్ణోగ్రత మార్పులకు తట్టుకోవడానికి వీలుగా లిథియాన్ని కలుపుతారు. వేడిని తట్టుకునే గ్రీజ్‌లు, లూబ్రికెంట్లలోనూ ఈ ఖనిజాన్ని ఉపయోగిస్తారు. విమాన పరికరాలను తక్కువ బరువుతో తయారు చేయడం కోసం అల్యూమినియం, రాగితో లిథియం మిశ్రమాన్ని కలిపి ఉపయోగిస్తారు. అణ్వాయుధాల తయారీలోనూ లిథియం ఐసోటోప్‌ల (6 Li)ను ఉపయోగిస్తారు.