తన పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ తీవ్ర మోకాలు నొప్పితో బాధపడినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర గురించి ఆయన ఆసక్తికర విషయాలు తెలిపారు. రాహుల్ కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు నడిచి యాత్రను విజయవంతంగా ముగించారు. అయితే, రాహుల్ ఆరంభంలోనే యాత్రను అర్ధంతరంగా ముగించాలని అనుకున్నారని వేణుగోపాల్ చెప్పారు. జోడో యాత్ర మూడో రోజునే కేరళలో ప్రవేశించిన తర్వాత రాహుల్ మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడ్డారని తెలిపారు. దాంతో, తాను ఆగిపోయి, మరొక నాయకుడికి జోడో యాత్రను ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను అప్పగించాలని రాహుల్ గాంధీ అనుకున్నారని వెల్లడించారు.
రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ ఆ ఆలోచనను సమర్థించారన్నారు. అయితే, మోకాళ్ల నొప్పులకు ఫిజియోథెరపీ చేయించుకున్నతర్వాత రాహుల్ యాత్రను పూర్తి చేశారన్నారు. కాగా, రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ను గతేడాది సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 30న కశ్మీరులో ముగించారు. 4,080 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, 12 రాష్ట్రాల్లోని 75 జిల్లాల మీదుగా నడిచారు.