కాకినాడ జిల్లా పెద్దాపురంలోని అంబటి ఆయిల్ కంపెనీలో ఈనెల 9న జరిగిన దుర్ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందడానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని తేలింది. సంస్థ ఘోర తప్పిదంతోనే వీరంతా చనిపోయారని ప్రమాద ఘటనపై నియమించిన ఉన్నతాధికారుల బృందం తేల్చిచెప్పింది. అనుభవం లేని కార్మికులను నూనె ట్యాంకులోకి దించడంతోనే ఊపిరి ఆడక వారంతా ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారని అధికారుల కమిటీ పేర్కొంది. అసలు ఆయిల్ ప్యాకింగ్ యూనిట్‌కు కర్మాగారాల శాఖ నుంచి అనుమతులే లేవని నిగ్గు తేల్చింది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలాకియా ఆధ్వర్యంలో కమిటీ ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగిందో తమ నివేదికలో వివరించింది.